Tuesday, December 18, 2012

Exercise Teacher Kiran dembla-వ్యాయామ శిక్షకురాలు కిరణ్‌ దేంబ్లా



  •  
  •  
 ఓ గెలుపు మరిన్ని విజయాలకు వూపిరిపోస్తుంది. పెరిగిన బరువుని అదుపులో ఉంచుకోవడం ఓ విజయం. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని విభిన్న వ్యాయామ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించిన ప్రతిభావని కిరణ్‌.. ఇప్పుడు సినీ ప్రముఖులకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకొన్నారు. తాజాగా అసెంబ్లీ మర్యాదలు పాటించేందుకు సహకరించే సుమారు వందమంది మార్షల్స్‌కు ప్రత్యేకంగా శిక్షణనిచ్చారు. వ్యాయామ విద్యలో వహ్వా అని పించుకొంటున్న ఆమెతో వసుంధర ముచ్చటించింది.

హైదరాబాద్‌లోని గోషామహల్‌ పోలీస్‌ స్టేడియం. వంద మంది పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అందరూ మగవాళ్లే. ట్రైనర్‌ ఆదేశాలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. వారందరి ముందున్న లక్ష్యం ఒక్కటే.. ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సమావేశాల్లో గొడవ చేసే సభ్యులను చాలా జాగ్రత్తగా బయటకు పంపడం. మొండికేసే వారికి మర్యాదనిస్తూనే ఎత్తుకెళ్లి సమావేశ మందిరం బయట దించేయడం. సభలో ఉండే వారంతా ప్రముఖులు. వారి వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా చాలా జాగ్రత్తగా చేయాల్సిన పనది. అందుకే ప్రత్యేక నైపుణ్యాలు పెంచుకునేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా చెప్పినప్పుడు.. అక్కడెవరో కాకలు తీరిన పోలీసు యోధులు, ఉన్నతాధికారులు తర్ఫీదు ఇస్తున్నారని అనుకోవడం సహజం. కానీ అక్కడ వారిని తీర్చిదిద్దేది ఓ మహిళా వ్యాయామ శిక్షకురాలు. పేరు కిరణ్‌ దేంబ్లా. గౌరవ సభ్యుల మనసు, శరీరం గాయపడకుండా ఎలా వ్యవహరించాలో మార్షల్స్‌కి నేర్పిస్తున్నారామె. శరీర బరువు తగ్గించుకోవడం, దృఢంగా ఉండడానికి సంబంధించిన కసరత్తులూ వారితో చేయిస్తున్నారు. సుశిక్షితులైన వారికే మెలకువలు నేర్పే అరుదైన అవకాశం అందుకున్న కిరణ్‌ తన బోధన అనుభవాలను, గృహిణి నుంచి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా మారిన క్రమాన్ని ఇలా తెలిపారు.


'నాకు మొదట్లో వ్యాయామశాల అంటే ఏంటో కూడా తెలీదు. ఆగ్రాలో పుట్టి పెరిగాను. 1997లో పెళ్లయిన తరువాత నా భర్త అజిత్‌ ఉద్యోగరీత్యా బెంగళూరుకు, అక్కడి నుంచి 2006లో హైదరాబాద్‌కి వచ్చేశాం. అప్పటి నుంచి ఇక్కడే స్థిరపడిపోయాం. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ గడిపేదాన్ని. జీవితం సాదాసీదాగా సాగిపోతుందనిపించేది. అందుకే చిన్నప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన సంగీతాన్నే వ్యాపకంగా మార్చుకోవాలనుకున్నాను. 'స్వర సంగమ్‌' పేరుతో పాఠశాల ఏర్పాటు చేసి పాఠాలు చెప్పేదాన్ని. రోజులో ఎక్కువ సమయం సంగీత శిక్షణలో ఉండడంతో
బరువు విపరీతంగా పెరిగిపోయాను. 75 కిలోలకు చేరుకున్నాను. వూబకాయం ఎప్పటికైనా ఆరోగ్యానికి ముప్పని భావించి బరువు తగ్గడం కోసం ఈత నేర్చుకోవడానికి వెళ్లాను. కానీ శరీరం సహకరించలేదు. నిరాశతో పదిహేను రోజుల్లోనే ఈత కొలనుకు వెళ్లడం మానేశాను.

కళ్లముందు లక్ష్యమే కదలాడేది...
కొద్దిరోజులకే మళ్లీ నాలో అంతర్మథనం మొదలైంది. ఎందుకు నేను సాధించలేకపోయాను? నాకు ఎందుకు సాధ్యం కాదన్న ప్రశ్న మనసులో తలెత్తడంతో ఎలాగైనా ఈత నేర్చుకోవాలన్న కోరిక పెరిగింది. నిద్రపోతున్న సమయంలోనూ ఈత కొడుతున్నట్లుగా కలలొచ్చేవి. దాంతో ఎలాగైనా ఈత నేర్చుకుని 50 కిలోలకు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మళ్లీ ఈతకు వెళ్లడం ప్రారంభించి పట్టుదలతో మూడు రోజుల్లోనే నేర్చుకున్నాను. కొన్నాళ్లకు బరువు తగ్గాను  కానీ శరీరం రంగు మారింది, నల్లబడ్డాను. రంగు మారకుండా, బరువు పెరగకుండా, మంచి ఆకృతి సాధించుకోవాలన్న తపనతో వ్యాయామశాలకి వెళ్లాలని
నిశ్చయించుకున్నాను. ఈ నిర్ణయం నాకు ఆరోగ్యపరంగా ఉపయోగపడడమే కాదు, ఇప్పుడీ విధంగా వందల మందికి శిక్షణనిచ్చే దిశలో తోడ్పడుతోంది. మొదట్లో శరీర బరువు, ఆకృతిపైనే దృష్టి పెట్టాను. క్రమంగా ఫిట్‌నెస్‌ రంగంలో జ్ఞానం  పెంచుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. అందుబాటులో ఉన్న అన్ని  అవకాశాలను ఉపయోగించుకున్నాను.. శిక్షకుల నుంచి, ఫిట్‌నెస్‌ మ్యాగజీన్లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ వీడియోల నుంచి చాలా నేర్చుకున్నాను. అక్కడితో ఆగకుండా 'ఆమెరికన్‌ మజిల్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌' కోర్సు పూర్తిచేశాను. ఇది పురుషులకు మాత్రమే సంబంధించిందన్న అభిప్రాయం  మార్చాలనుకున్నాను. 2008లో సొంతంగా వ్యాయామశాల ఏర్పాటుచేసి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను. కొద్దిరోజుల్లోనే నా ప్రయత్నానికి గుర్తింపు  లభించింది.. సినీ ప్రముఖులకు వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. దీక్షాసేథ్‌, కాజల్‌, తమన్నా వంటి ప్రముఖ నాయికలకే కాదు  నటుడు రామ్‌చరణ్‌కీ వ్యక్తిగత శిక్షకురాలిగా పనిచేశాను. రానా, ప్రభాస్‌, ప్రకాశ్‌రాజ్‌, లారెన్స్‌ వంటి వారితోనూ కలిసి పనిచేశాను. వ్యక్తుల ఆహార అలవాట్లు, శరీరం తీరు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎవరికి ఏ తరహా శిక్షణ అవసరమో దాన్ని అమలు చేసి ఫలితాలు సాధించడంతో మంచి గుర్తింపు లభించింది.

మెరుగులద్దే మెలకువలు..
నా గురించి విన్న పోలీసు ఉన్నతాధికారులు నన్ను సంప్రదించారు. శాసనసభ మార్షళ్ల దేహదారుఢ్యం పెంచడానికి, కించిత్‌ హాని కలగకుండా సభ్యులను వెలుపలకు తీసుకు రావడానికి అవసరమైన మెలకువలు నేర్పే బాధ్యత  అప్పగించారు. వారిచ్చిన సూచనల ప్రకారం నిన్నటి నుంచి ప్రారంభమైన శాసనసభ 
సమావేశాలకు ముందు ఐదు రోజులు వారికి శిక్షణ ఇచ్చాను. సభలో ఉండేవారంతా ప్రముఖులు. వారిలో ఆరోగ్యంగా ఉన్నవారు, సమస్యలతో  బాధపడుతున్నవారు, సున్నిత మనస్కులు.. ఇలా అన్ని రకాల వారు ఉంటారు. వారు శారీరకంగా, మానసికంగా గాయపడకుండా వ్యవహరించాల్సిన పద్ధతులు, మెలకువలు నేర్పాను. భవిష్యత్తులోనూ పోలీసులకు శిక్షణ ఇచ్చే ఆలోచన ఉంది.

విదేశాల్లో ఎంతో ఆదరణ..
ఐరోపా, అమెరికా ఖండాల్లోని దేశాల్లో శరీర దారుఢ్యంపై శ్రద్ధ ఎక్కువ. అక్కడ వ్యక్తిగత శిక్షకులను నియమించుకునే వారి శాతమూ ఎక్కువే. పేరుమోసిన బాడీ బిల్డర్లకు కూడా శిక్షకులుగా మహిళలు వ్యవహరిస్తుంటారు. అయితే ఒకటి.. వ్యాయామ విద్యను వృత్తిలా కాకుండా ఓ కళగా భావించాలి. శాస్త్రంగా అధ్యయనం చేయాలి.

సంగీతమంటే ప్రాణం...
నాకు సంగీతమంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. 'భారతీయ గాత్ర సంగీతం'లో పీజీ చేశాను. చాలా ప్రదర్శనలిచ్చాను. సంగీతం నేర్పినప్పుడు గాయని గీతా మాధురి నా దగ్గర నేర్చుకుంది. ఇప్పుడు తీరికలేకపోవడంతో సంగీతాన్ని వదులుకున్నాను. అప్పుడప్పుడూ సరదాగా హమ్‌ చేస్తుంటే పాటలు విని రామ్‌చరణ్‌, ఇతర సినీ ప్రముఖులు గాయనిగా అవకాశాలు కల్పిస్తామన్నారు కుటుంబం, ఫిట్‌నెస్‌ వ్యాపకాలే ఇప్పుడు నాకు రెండు కళ్లు. వాటికంటే ఇంకేదీ ప్రాధాన్యాంశం కాదు. ఏమాత్రం సమయమున్నా అది నా భర్త, పిల్లలకే కేటాయిస్తుంటాను. 'ఇన్ని పనులు ఎలా చెయ్యగలుగుతున్నావు అమ్మా' అని నా పిల్లలు అప్పుడప్పుడూ అడుగుతుంటారు.. అప్పుడు నేనేం చెబుతానో తెలుసా? 'చెయ్యాలని బలంగా అనుకుంటే ఏదైనా సాధ్యమే' అని.

- అరుణ్‌ పృథ్వి శాండిల్య, హైదరాబాద్‌@ఈనాడు వసుందర పేపర్ .
  • ===========================
Visit my website : Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Thanks for your Comment. It is very important for improvement of this blog.